ఇండస్ట్రీ లెజండ్ దాసరి నారాయణరావు దర్శకులను ఉద్దేశిస్తూ ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు. దర్శకులు వరసగా హిట్లు కొట్టి టాప్ రేంజ్ కు చేరిపోయినా కానీ మధ్యమధ్యలో యంగ్ హీరోలతో, మిడ్ బడ్జెట్ లతో సినిమాలు తీయాలి. అప్పుడే దర్శకుడిగా తనకంటూ పట్టు ఉంటుంది. రెఫ్రెషింగ్ ఐడియాస్ వస్తాయి. టాప్ హీరోలతో అన్ని రకాల సినిమాలూ తీయలేం, అందుకే చిన్న హీరోలతో లేదా కొంత తక్కువ బడ్జెట్ లో మిడ్ రేంజ్ హీరోలతో కూడా సినిమాలు చేయాలనేది దాసరి భావన. కానీ ఇప్పటితరం దర్శకులు ఎవరు చూసినా ఒక్కసారి టాప్ రేంజ్ కు చేరుకున్నారంటే ఇక కిందకి దిగడం లేదు.
రెండేళ్ల క్రితం మహేష్ బాబు ఒక వేదికపై చెప్పినట్లు, తిప్పి కొడితే ఇండస్ట్రీ 5 లేదా 6 టాప్ హీరోలు ఉన్నారు. టాప్ రేంజ్ కు చేరుకున్న దర్శకులు అందరూ ఇక టాప్ హీరోలతోనే సినిమాలు చేస్తాం అంటే ఎలా? మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నే తీసుకోండి. తొలి సినిమా నువ్వే నువ్వేను పక్కన పెడితే మిగతా అన్ని సినిమాల్లో హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్. మధ్యలో నితిన్ తో అ.. ఆ అని ఒక సినిమా తీసాడు, సూపర్ హిట్ కొట్టాడు కూడా. విషయమేంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, తర్వాతి సినిమాకు ఎన్టీఆర్ కు కమిట్ అయ్యాడు. దాని తర్వాత కూడా రామ్ చరణ్, మహేష్ బాబు కుదిరితే చిరంజీవితో కూడా సినిమా కమిట్మెంట్స్ ఉన్నాయి.
ఇవన్నీ పక్కనపెడితే వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా మూడేళ్ళ క్రితం హారిక అండ్ హాసిని బ్యానర్ నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. ఇన్నేళ్లు జరిగినా ఇంకా ఆ న్యూస్ కార్యరూపం దాల్చలేదు. అసలు జరుగుతుందో లేదో కూడా తెలీదు. త్రివిక్రమ్ కు ఉన్న వరస కమిట్మెంట్స్ తో ఇప్పట్లో వెంకీతో త్రివిక్రమ్ సినిమాను ఊహించలేమనే చెప్పాలి.
సరైన కామెడీ ఎంటర్టైనర్ పడితే వెంకటేష్ ఏ రేంజ్ లో ఆడుకుంటాడో ఇప్పటికే మనం ఎఫ్ 2 చిత్రం ద్వారా చూసాం. అదే ఇప్పుడు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి తరహా కామెడీ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో అంటే ఊహించుకోవడానికే అదిరిపోయే రేంజ్ లో ఉంది. మరి అది ఎప్పటికైనా జరిగేనా?
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PL66Wf
Comments
Post a Comment