ఒక యాభై సంవత్సరాల క్రితం ప్రపంచం ఇలా ఉండేది కాదు. ఏ తల్లిదండ్రులు.. తన కొడుకులు, కూతుళ్లు దేశం కాని దేశం పోయి ఉంటానంటే, ఒప్పుకునే వాళ్ళు కాదు. మనకు ఉన్నదేదో, మనకి తోచిందే చేసుకుంటూ నా అన్న వాళ్ళందర్నీ ఇక్కడే చూసుకుంటూ హాయిగా కాలం గడపమని చెప్పేవాళ్లు.
కానీ ఎప్పుడైతే ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్, నాగరికత అనే పేరుతో ఇష్టం వచ్చినట్లు, ఎవరు పడితే వాళ్లని దేశంలోనికి వ్యాపారం కోసం గేట్లు బార్లా తెరిచి, మన దేశంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవస్థలను పట్టించుకోవటం ఇక్కడి రాజకీయ నాయకులు మానేశారో, మన ఇళ్ళల్లో ఉండే అమ్మ బాబులకు “పొరుగింటి పుల్లకూర రుచి” అని ఒక రోగం వచ్చింది.
దాని తాలూకు లక్షణాలే కొడుకులకు కూతుళ్ళకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంజనీరింగ్ కానీ డాక్టర్ గానీ చదివించి, అందుకోసం లెక్కలేనంత గా అవినీతి చేసి డబ్బులు సంపాదించి, బంధు వర్గాలని స్నేహితులను పోగొట్టుకొని, వాళ్లని అమెరికా – ఆస్ట్రేలియా పంపించి వాళ్లు అక్కడ ఏం పీకుతున్నారో పట్టించుకోకుండా ఇక్కడ వీళ్ళు కాలర్ ఎగరెయ్యడం.
ఈ దరిద్రం ఎంతవరకు వెళ్లిందంటే, ఎవడైనా చదువు పూర్తయిన తర్వాత ఉన్న ఊరిలో ఉండి పని చేసుకొని బతుకుతుంటే వాడిని చేతగాని వెదవల కింద లెక్క కడుతుంది సమాజం.
అసలు ఇంతకీ నా బాధ ఏంటంటే ఇప్పుడు “ప్రెషర్ కుక్కర్” ఒక సినిమా వస్తోంది. ఆ సినిమాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలు ఉన్నాయి. ట్రైలర్ లో అయితే మరీ దారుణంగా, ఒక పిల్లాడిని స్కూల్లో టీచర్ రాష్ట్రాల పేర్లు చెప్పు, అంటే అమెరికాలో ఉండే రాష్ట్రాల పేర్లు చెబుతుంటాడు.
ఇంట్లో వాళ్ళ అయ్యా ఏమో… భారతదేశం మ్యాప్ కాకుండా అమెరికాలో ఉండే వాళ్ల బంధువులను మ్యాప్ తో సహా చూపిస్తూ నువ్వు ఎక్కడ తిరిగినా.. చివరికి ఎక్కడికి పోవాలి ! అని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటాడు.
మొత్తానికి పిల్లలను అమెరికాకు తోసి, ఏదో దేశ స్వాతంత్ర్యం కోసం పాటు పడ్డామని అని బిల్డప్ ఇచ్చే అమ్మ బాబుల మీద సెటైరికల్ గా ఒక సినిమా వస్తోంది. నాకు అంతే సంతోషం.
కొత్త రకంగా కథలు తీస్తున్న తరుణ్ భాస్కర్ ఈ ట్రైలర్ ను ఎడిట్ చేశాడు. ఈ సినిమాలో సీనియర్ నటులు నరసింహారావు, తనికెళ్ల భరణి లతోపాటు, రాహుల్ రామకృష్ణ లాంటి యువ నటులు కూడా నటిస్తున్నారు. సుజోయ్ -సుశీల్ అని ఒక ఇద్దరు అమెరికా నుంచి తిరిగి వచ్చి నిజజీవితంలో జ్ఞానోదయం అయిన కుర్రాళ్లు తీసిన సినిమా ఇది. మన అర్జున్ రెడ్డి సినిమా కి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది
అయినా ఎప్పుడో నా చిన్నప్పుడు బొమ్మరిల్లు సినిమా వచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నా… మన ఇంట్లో పేరెంట్స్ ఏమైనా మారారా..? లేదు కదా ఏదో మన పిచ్చి ఆశ కాకపోతే.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/34HVs7c
Comments
Post a Comment