ఏ హీరో అయినా ఒక సినిమాకు 5 ఏళ్ళు కేటాయించగలడా? అంత ధైర్యం ఎవరు చేస్తారు? ఆ సినిమా ఏదైనా తేడా అయితే తన కెరీర్ మొత్తం ప్రమాదంలో పడుతుంది. అయినా ప్రభాస్ నమ్మాడు. రాజమౌళిపై నమ్మకముంచాడు. బాహుబలి అందించాడు. పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. బాహుబలి క్రెడిట్ ను ఎక్కువమంది రాజమౌళి ఖాతాలో వేయడానికే ఇష్టపడతారు కానీ ప్రభాస్ తన 5 ఏళ్ళు ఈ సినిమాకు ఇవ్వకపోయి ఉంటే రాజమౌళి ఇంత ఫ్రీ గా మనసు పెట్టి బాహుబలిని తెరకెక్కించేవాడు కాదేమో. బాహుబలిలో నటించిన నటీనటులందరూ మధ్యలో వేరే సినిమాలు చేసుకున్నారు కానీ ప్రభాస్ మాత్రం బాహుబలికే కట్టుబడి ఉన్నాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలుగా సినిమాపై ప్రభాస్ కున్న ప్యాషన్ గురించి చెప్పడానికి.
ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తన కెరీర్ లో అతి ముఖ్యమైన 7 సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. వర్షం :
ఎలాంటి హీరోకైనా మొదటి హిట్ అనేది అత్యంత ప్రత్యేకమైంది. తర్వాత ఎంత పెద్ద విజయాలు సాధించినా మొదటి విజయం ఎప్పుడూ మనసుకు దగ్గరగా ఉంటుంది. ప్రభాస్ కెరీర్ లో చేసిన మూడవ చిత్రం వర్షం తనకు మొదటి విజయాన్ని అందించింది. ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా మరో స్థాయికి వెళ్లాడనే చెప్పాలి. ప్రభాస్ కంటూ ఫ్యాన్ బేస్ ఏర్పడింది ఈ చిత్రంతోనే.
2. చక్రం :
కమర్షియల్ విజయాలు కెరీర్ కు ముఖ్యమైతే నటుడిగా ఎదగడం కూడా అంతే ముఖ్యం. నటుడిగా ఛాలెంజింగ్ రోల్ లో నటించిన అవకాశం ప్రభాస్ కు 5వ చిత్రం ద్వారా వచ్చింది. అదే చక్రం. కమర్షియల్ గా ఈ చిత్ర విజయం గురించి పక్కనపెడితే, ప్రభాస్ ఒక మంచి నటుడని అందరూ గుర్తించిన చిత్రం చక్రం. కేవలం హీరోయిజం మాత్రమే కాకుండా అన్ని రకాల ఎమోషన్స్ ను ప్రభాస్ పలకించగలడని గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం చక్రం.
3. ఛత్రపతి :
టాప్ హీరోగా ఎదగాలంటే మాస్ ప్రేక్షకుల అభిమానం కచ్చితంగా పొందగలగాలి. ప్రభాస్ ను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమా ఛత్రపతి. ఇప్పటికీ ఈ చిత్రంలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ గురించి చర్చించుకుంటాం. ఈ సినిమా సాధించిన విజయం ప్రభాస్ ను లీగ్ లో కూర్చోపెట్టింది. అటు మాస్ పాత్ర చేస్తూనే ఇటు అమ్మ సెంటిమెంట్ ను కూడా అద్భుతంగా పండించాడు ప్రభాస్.
4. బుజ్జిగాడు :
నటుడన్నాక ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు చేయలేరు. ఎవరికైనా మేకోవర్ అనేది చాలా ముఖ్యం. అప్పటిదాకా ప్రభాస్ తన కెరీర్ లో అన్ని రకాల ఎమోషన్స్ ను చూపించాడు కానీ కామెడీని అంత ఎక్కువగా చేసింది లేదు. బుజ్జిగాడు చిత్రంలో హీరో పాత్రే మాగ్జిమమ్ ఎంటర్టైన్మెంట్ ను పంచుతుంది. మేకోవర్ పరంగా ప్రభాస్ కెరీర్ లో బుజ్జిగాడు చాలా ముఖ్యమైన చిత్రం. ప్రభాస్ డైలాగ్ డెలివరీ, మోడ్యులేషన్, మ్యానరిజమ్స్ ఇలా అన్నిట్లోనూ కొత్తదనం తీసుకొచ్చిన సినిమా బుజ్జిగాడు.
5. డార్లింగ్ :
మాస్ సినిమా చేసాడు, కామెడీ పండించాడు, రకరకాల ప్రయత్నాలు చేసాడు కానీ ప్రభాస్ కు విజయం మాత్రం అందని ద్రాక్ష లానే ఉంది. అలాంటి సమయంలో ప్రభాస్ చేసిన డార్లింగ్ అతన్ని తన అభిమానులకు డార్లింగ్ ను చేసేసింది. అప్పటినుండి ప్రభాస్ ను అభిమానులు, అభిమానులను ప్రభాస్ డార్లింగ్ అని పిలుచుకోవడం పరిపాటి అయిపోయింది. డార్లింగ్ తో ఐదేళ్ల తర్వాత హిట్ కొట్టిన ప్రభాస్ స్టార్ హీరోల రేంజ్ కు ఈ చిత్రంతోనే దగ్గరయ్యాడు.
6. మిర్చి :
ప్రభాస్ అప్పటికే బాహుబలి చేసేయాలని డిసైడ్ అయిపోయాడు. కొరటాల శివ తీసుకొచ్చి మిర్చి కథ చెబితే నచ్చింది కానీ బాహుబలి చేయాలి కాబట్టి నో చెప్పేద్దామని అనుకున్నాడు. రాజమౌళిని అడిగితే బాహుబలి మొదలుపెట్టడానికి ఇంకా ఆరేడు నెలల సమయం ఉంది కాబట్టి చేయమనే సలహా ఇచ్చాడు. మిర్చి ప్రభాస్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పవచ్చు. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ పెర్ఫెక్ట్ గా కుదిరిన సినిమా మిర్చి. ఇందులో ప్రభాస్ లుక్స్ కు అమ్మాయిలు ఫిదా అయిపోయారు.
7. బాహుబలి 1 అండ్ 2 :
ఎవరైనా ఒక తెలుగు సినిమా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుందని, దేశం మొత్తం ఒక తెలుగు సినిమా గురించి చర్చించుకుంటుందని ఊహించామా, కానీ బాహుబలితో అది సాధ్యమైంది. ఈ చిత్రం దేశవ్యాప్తంగానే కాదు ఖండాంతరాలు దాటి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ప్రభాస్ ఇప్పుడు నేషన్ వైడ్ స్టార్. దానికి సరైన ఉదాహరణ సాహో.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు. ఈ సామెత అర్ధం కాకపోతే.. ఎంత ఎదిగినా ప్రభాస్ లా ఉండాలి అని మార్చికోవచ్చు. ఇప్పటికీ అదే సింప్లిసిటీ. ఇప్పటికీ అదే ఒదిగివుండే గుణం. అందరికీ ఆప్యాయంగా పలకరించే మనసు ప్రభాస్ ను రారాజును చేసింది. అందరికీ డార్లింగ్ గా మార్చింది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2WavSF0
Comments
Post a Comment