మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిన్న వయసులోనే నిర్మాతగా మారాడు. తన తండ్రి చిరంజీవి పునరాగమనం తర్వాత నిర్మాతగా మారిన చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ను స్థాపించి వరసగా చిరుతో ఖైదీ నెం 150, సైరా నరసింహారెడ్డి చిత్రాలను నిర్మించాడు. ఇప్పుడు చిరంజీవితో కొరటాల శివ తీయబోయే చిత్రానికి కూడా చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని కూడా చరణే నిర్మించనున్నట్లు తెలుస్తోంది. నటుడిగా టాప్ స్థాయికి చేరే దశలో ఇలా నిర్మాతగా వరుస చిత్రాలు నిర్మించడం కెరీర్ పైనే ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? అసలు భవిష్యత్తులో చిరంజీవి సినిమాలన్నిటినీ చరణే నిర్మించనున్నాడా? వీటికి సమాధానాలు రామ్ చరణ్ స్వయంగా ఇచ్చాడు.
రీసెంట్ గా మీడియాతో ముచ్చటించిన రామ్ చరణ్ పలు విషయాలపై స్పందించాడు. ముందుగా సైరా గురించి మాట్లాడుతూ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 275 కోట్ల వసూళ్లు సాధించిందని, ఈ చిత్రం పట్ల తాము పూర్తి సంతృప్తిగా ఉన్నామని చరణ్ వెల్లడించాడు. హిందీలో సైరా ఆడకపోవడానికి అక్కడ వార్ సినిమాతో పోటీనే కారణమని వెల్లడించాడు. వార్ అక్కడ 300 కోట్లు వసూలు చేస్తే సైరా హిందీ కాకుండానే 275 కోట్లు వసూలు చేసిందని వ్యాఖ్యానించాడు. అయితే సైరా హిందీలో ఆడకపోవడానికి అసలు కారణం అక్కడ ప్రమోషన్స్ సరిగ్గా జరక్కపోవడమని చరణ్ ప్రస్తావించలేదు.
ఆ తర్వాత RRR సినిమా గురించి మాట్లాడుతూ అందరూ అనుకుంటున్నట్లు RRR వాయిదా పడిందన్న వార్తల్లో నిజం లేదని, షూటింగ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే నడుస్తోందని ఎట్టి పరిస్థితుల్లోనూ జులై 30కి RRR ను విడుదల చేసి తీరుతామని వ్యాఖ్యానించాడు. దీంతో RRR చిత్రంపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్లయింది. దీని తర్వాత నిర్మాతగా చరణ్ ప్రణాళిక ఏమిటన్న విషయంపై ప్రశ్నలు వచ్చాయి. దీనికి రామ్ చరణ్ స్పందిస్తూ తాను అనుకోకుండా నిర్మాతను అయ్యానని, తండ్రి కోరిక మేరకే కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ను స్థాపించమని అన్నాడు. “చిరంజీవి గారి రీ ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలని ఖైదీ నెం 150ను సొంత బ్యానర్ లో నిర్మించాం. ఇక సైరా విషయంలో సొంత బ్యానర్ లోనే తీద్దామనుకున్నాం. ఇది అత్యంత రిస్క్ తో కూడిన ప్రాజెక్ట్. వేరే నిర్మాత అయితే తొలి షెడ్యూల్ అయ్యేసరికి ఆపేసేవాళ్ళం అని అన్నాడు. ఇక కొరటాల శివ – చిరంజీవి సినిమాకు తాను ప్రధాన నిర్మాతను కాదన్నాడు. ప్రొడక్షన్ వ్యవహారాలు అన్నీ మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ చూసుకుంటుందని, తాను కేవలం చిన్న భాగస్వామినని తెలిపాడు. భవిష్యత్తులో చిరంజీవి సినిమాలన్నిటికీ నిర్మాతగా మీరే ఉంటారా అన్న ప్రశ్నకు, ఇప్పుడే దాని గురించి చెప్పలేం అనేశాడు చరణ్.
ఇక పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇచ్చే విషయమై స్పందిస్తూ “నన్ను అడిగితే అకీరాను లాంచ్ చేయడానికి నేను సిద్ధమే. తొలి చిత్రాన్ని నేనే నిర్మిస్తా” అని అన్నాడు రామ్ చరణ్. ఒకే ఇంటర్వ్యూతో బోలెడన్ని పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేసాడు. ఇక రూమర్ రాయుళ్లు కొత్త రూమర్స్ వెతుక్కోవాలి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/31Y0sD6
Comments
Post a Comment